KTR | హైదరాబాద్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను పడావుబెట్టి.. ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎండబెడుతున్నది.. రైతుల నోట్లో మట్టి కొడుతున్నది సీఎం రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. జడ్చర్లలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ 21 నెలలో ఎక్కడ మాట్లాడిన నేను పాలమూరు బిడ్డను.. వెనుకబడ్డ ప్రాంతమైన నల్లమల నుంచి వచ్చిన బిడ్డను.. ఆకలి విలువ తెలిసిన వాన్ని.. రైతు గురించి తెలిసిన వాడిని.. రైతు కుటుంబంలో వచ్చిన వాడిని అని ప్రతి వేదికపైన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ.. ఈ రెండు పార్టీలు పాలమూరు వెనుకబాటు తనానికి కారణమని రేవంత్ చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇది ఈ జిల్లా వాసులకు కూడా తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మా జిల్లా బిడ్డ సీఎం అయితే కొంత ప్రయోజనం కలుగుతుందని, లాభం ఉంటుందని, తప్పకుండా శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని, పాలమూరు బతుకు ముఖచిత్రం మారుతుందని ఇలా ఎన్నో ఆశలతో ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. నిన్నటితో 21 నెలలు నిండి 22వ నెలలో నడుస్తుంది. వాస్తవం ఏందంటే.. కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు ఎత్తిపోతల కింద 90 శాతం పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ఒక వడ్డించిన విస్తరిలా రేవంత్‌కు అప్పజెప్పి గద్దె దిగాం. రేవంత్ చేయాల్సింది 10 శాతం పనులు మాత్రమే. కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పని చేయకుండా.. కేసీఆర్ కట్టిన కరివెన, వట్టెం, ఉద్ధండపూర్, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు ప్రజలకు గుర్తు వస్తది.. రైతులు శాశ్వతంగా కేసీఆర్ పేరును గగుండెల్లో పెట్టుకుంటారని చెప్పి ఒక దురాచలోనతో కావాలని ఈ ఎత్తిపోతలను రేవంత్ రెడ్డి పడావు పెట్టారు. ఈ పరిస్థితులను రైతాంగం గమనిస్తుంది అని కేటీఆర్ తెలిపారు.
పాలమూరు ఎత్తిపోతల ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి శ్రీశైలం నుంచి జూరాలకు సోర్స్ మార్చి కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ. 4 వేల కోట్లతో ప్రత్యేక టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతల్లేవు. కొడంగల్ ఎత్తిపోతలపై గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు. మాకు పరిహారం చెల్లించాలని కదం తొక్కుతున్నారు అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా పాలమూరును సస్యశ్యామలం చేయడమే కాకుండా, కోనసీమ జిల్లాగా మార్చాలని పాలమూరు ఎత్తిపోతలో 90 శాతం పనులు పూర్తి చేశారు ఇది కేసీఆర్ ఘనత. 22 నెలలుగా మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు బిడ్డగా చెప్పకునే రేవంత్ రెడ్డి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అరపైసా పని చేయకుండా.. పాలమూరు ఎత్తిపోతలకు పిల్లనిచ్చిన మామ జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నారు. జైపాల్ రెడ్డి నీటిపారుదల రంగానికి ఏం చేశారో జిల్లా వాసులకు తెలుసు. ఒక్క రూపాయి కేటాయించకుండా ఆ ప్రాక్టును పూర్తి చేయకుండా పడావుబెట్టి.. రైతుల నోట్లో మట్టి కొడుతున్నది రేవంత్ రెడ్డినే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.