KT Rama Rao | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : రైతు రుణమాఫీపై జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో చేసిన పోస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అది పచ్చి అబద్ధమని మండిపడ్డారు. ఇప్పటి వరకు 40 శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదని స్పష్టంచేశారు. తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు ఎక్స్‌లో కాంగ్రెస్ చేసిన పోస్ట్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఏ విధంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపొందించిన చిత్రాన్ని వాడారో.. రుణమాఫీ జరిగిన రైతుల లెకల విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి అదే టెక్నిక్ వాడారంటూ ఎద్దేవాచేశారు. ‘కృత్రిమమేధ (ఏఐ) దృశ్యాలను మార్చినట్టు ఎనుమల ఇంటెలిజెన్స్ (ఏఐ) హామీల తేదీలు, లెక్కలు మార్చుతున్నది’ అని ఎద్దేవాచేశారు. ‘ఇప్పటివరకు రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులకు..అంటే 40 శాతం కంటే తకువ మందికే రుణమాఫీ అయిందని, ఇంకా 60 శాతం మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం, సొంత నియోజకవర్గంలో కూడా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బూటకపు ప్రచారాలు నిత్యం దిగ్విజయంగా కొనసాగుతున్నాయని ఎద్దేవాచేశారు.
మంచి రిపోర్టే ఇస్తది!
దక్షిణ కొరియాలోని సియోల్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన తెలంగాణ నిపుణుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఫలప్రదమైన నివేదికనే అందిస్తుందని, మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చవుతాయన్న అంచనా రిపోర్టు అందజేస్తుందని కేటీఆర్ ఆదివారం ఎక్స్‌వేదికగా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.‘ఇక్కడి నది పునర్జీవం కోసం తెలంగాణ ప్రభుత్వం సియోల్‌లో వాగు పరిశీలన కోసం నిపుణులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, అధికారుల బృందాన్ని పంపడం ప్రశంసనీయం. ఆ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి నివేదికనే అందిస్తుంది. సుమారు రూ.1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పూర్తవుతుందనే నివేదిక ఇస్తుందనే నమ్మకం నాకున్నది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.