హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ మహిళా విభాగం సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు వివిధ జిల్లాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రకటించారు. తెలంగాణభవన్‌లో గురువారం బతుకమ్మ సంబురాల పోస్టర్‌తోపాటు ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ పాటలను మహిళా నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బతుకమ్మ ఆడారు. ఈ నెల 10న తెలంగాణభవన్‌లో బతుకమ్మ పండుగను ఎంగిలి పూలతో ఘనంగా ప్రారంభించనున్నారు. అనంతరం తొమ్మిది రోజులపాటు బీఆర్ఎస్ మహిళా నేతలు బృందాలుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారు.
కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చి తెలంగాణ సంస్కృతికి, మహిళల గౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ చెప్పారు. బతుకమ్మను కేవలం ఒక పండుగగా కాకుండా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిపేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేకుండా పోయిందని విమర్శించారు. బతుకమ్మ చీరల పంపిణీని కూడా ప్రభుత్వం నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ సంబురాల నిర్వహణపై తెలంగాణభవన్‌లో జరిగిన మహిళా నేతల సమావేశంలో పలు అంశాలపై చర్చించి కార్యక్రమాలను ఖరారు చేశారు. మాజీ మం త్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీసాయిచంద్, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు నిర్ణయించారు.