హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదస్థలికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం వెళ్లనున్నది. మాజీ మంత్రి టీ హరీశ్‌రావు సారథ్యంలో బీఆర్ఎస్కు చెందిన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ముఖ్యనాయకులు ఘటనా స్థలిని సందర్శించేందుకు వెళ్లనున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీప్రాంతంలోని దోమలపెంట వద్ద గత శనివారం సొరంగం పనులు జరుగుతుండగా భారీ ప్రమాదం సంభవించి 8 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్న విషయం తెలిసిందే. సొరంగం ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయకచర్యలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇంతకాలం అక్కడికి తాము వెళ్లలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సొరంగంలో చిక్కుకున్న జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ర్టాలకు చెందిన ఎనిమిది మంది కార్మికులు, సిబ్బంది కుటుంబాలకు ధైర్యం చెప్పటం తక్షణ అవసరమని అన్నారు. సహాయక చర్యలను పరిశీలించి తమవైపు నుంచి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయటానికి ఘటనా స్థలికి వెళ్లాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారని వివరించారు. తమ పర్యటనకు రాజకీయ ఉద్దేశం ఏమీలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని నాగకర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా వెల్లడించారు.