హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో రోజురోజుకూ బలపడుతున్నది. పండు ముదుసలి నుంచి పసిపిల్లాడి వరకు తెలంగాణ తొలి సీఎంపై అభిమానం వెల్లువెత్తుతున్నది. ఇదేకోవలో జోగుళాంబగద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కొమ్మవారి ప్రసాద్ అనే నిరుపేద యువకుడు కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టి హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌కు చేరుకున్నాడు. గత శుక్రవారం వెంకటాపురం నుంచి పాదయాత్ర ప్రారంభించాడు.
ఏడు రోజులపాటు అలంపూర్, ఎరవల్లి చౌరస్తా, కొత్తకోట, జడ్చర్ల, హెచ్‌బీఎల్ నగర్, మెహిదీపట్నం మీదుగా సుమారు 260 కిలోమీటర్లు కాలినడకన గురువారం తెలంగాణభవన్ చేరుకుని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి యువకుడిని అభినందించారు. కేసీఆర్‌పై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానమని పేర్కొన్నారు. నిత్యం కేసీఆర్‌పై పాడిన పాటలు, సార్ మాట్లాడిన మాటలు వింటానని తెలిపాడు.