హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రేవంత్ ప్రభుత్వం ఉద్యోగులను అడుగడుగునా చిన్న చూపు చూస్తూ తీవ్రంగా అవమానిస్తున్నదని, ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ఉద్యోగ సంఘాలు రోడ్డెకి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు దిగాల్సి వచ్చిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయమైన హకుల కోసం ఆందోళన బాటపట్టిన ఉద్యోగులను బెదిరించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కూరగాయల బేరాన్ని తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ఉద్యోగులు ఫ్యూచర్ సిటీలో వాటాలు, మూసీ ప్రక్షాళన కాంట్రాక్టులు అడుగడం లేదని.. తమకు రావలసి న హకులనే కోరుతున్నారని గుర్తుచేశారు. దసరా పండుగ వేళ మొకుబడిగా 2 డీఏలు ఇస్తామని ప్రకటించి ఉద్యోగులను కించపరిచారని ఆరోపించారు. జీతాలు, వేతన సవరణల విషయంలో రేవంత్ అసమర్థత వల్లే ఒకేరోజు ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే దయనీయ పరిస్థితి దాపురించిందని రాకేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎంప్లాయీస్ హెల్త్ సీమ్‌ను మూలనపడేశారని ధ్వజమెత్తారు. సీపీఎస్ రద్దు కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తారు..? ఎప్పటిలోగా అమలు చేస్తారో ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.