హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా ఆ పార్టీ అగ్రనేతల కార్యాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ఉన్నదా? తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో లేదనే సాకుతో దాడి ఎలా చేస్తారు? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌పై దాడి చేయడమంటే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై దాడి చేసినట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తాలిబన్లను మించిపోయారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని గుర్తించి, వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రభుత్వ సభల్లో పిలుపునిచ్చినప్పుడు ప్రొటోకాల్ ఉండదా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి తనకు తాను రాముడు అని బిల్డప్ ఇచ్చుకున్నారు కానీ, రామరాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి రావణాసురుని కన్నా అధ్వానంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దేశానికి గాంధీ మహాత్ముడు ఎలాగో.. కేసీఆర్ తెలంగాణకు గాంధీ అని.. శ్రవణ్ పేర్కొన్నారు. హోం శాఖ తన వద్ద పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి దాడులకు ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని శ్రవణ్ కోరారు.
సీఎం రేవంత్ రౌడీ రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు చిల్లర రౌడీల్లా ప్రవర్తిస్తే ఏం చేయాలో తమకు తెలుసని శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల గురించి అడిగితే ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేస్తారా? అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు, అరెస్టులు చేస్తున్న రేవంత్ తగిన మూ ల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.