MLC Kavitha | హైదరాబాద్ : ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి బీసీ బిల్లుపై చర్చించలేదు అని కవిత పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇవాళ కవిత మీడియాతో మాట్లాడారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే గ్రామ గ్రామాన వందలాది నామినేషన్లు వేపిస్తాం. ప్రతీ వార్డులో, పంచాయతీల్లో వందలాది నామినేషన్లు దాఖలు చేయిస్తాం. మనస్ఫూర్తిగా బీసీ బిల్లు ఆమోదానికి రేవంత్ రెడ్డి కృషి చేయడం లేదు. బీసీ బిల్లు కోసం తెలంగాణ వికసిత్ యాత్ర పేరిట బీజేపీ యాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉంది. బీసీ బిల్లుకు మద్ధతివ్వకుండా ఎన్ని యాత్రలు చేసినా బీజేపీని ప్రజలు నమ్మరు. బీసీ బిల్లు కోసం జూలై 17న పెద్ద ఎత్తున రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చాం. జూలై 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలు పెట్టుకున్నవాళ్లు వాయిదా వేసుకోండి. రైల్ రోకో కార్యక్రమానికి ఆయా కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమానికి మద్ధతిస్తున్నాయని కవిత తెలిపారు.
గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వృధా అవుతున్న గోదావరి నీటిని మన పొలాలకు మళ్లించుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన. తుపాకులగూడెం వద్ద నుంచే నదుల అనుసంధాన లింకేజ్ పాయింట్ ఉండాలని కేసీఆర్ వాదించారు. దీని వల్ల తెలంగాణలోని 6 జిల్లాలకు గోదావరి నీరు పుష్కలంగా లభించే అవకాశం ఉంటుంది. పోలవరం నుంచి లింకేజీ ప్రతిపాదనను గతంలోనే జగన్ ప్రతిపాదిస్తే కేసీఆర్ వ్యతిరేకించారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి తెలివిగా గోదావరి - పెన్నా అనుసంధానమని చెప్పి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పా కనీసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం లేదు. బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు..? చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లాలూచి ఏమిటో చెప్పాలి.? బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పీఎఫ్ఆర్ సమర్పించినా సీఎం స్పందించకపోవడం దుర్మార్గం అని కవిత మండిపడ్డారు.
తెలంగాణకు రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదని నిమ్మల రామానాయుడు చెప్పడం సరికాదు. గతంలో చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు సుప్రీం కోర్డులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. సుంకేసుల సామర్థ్యాన్ని పెంచుకున్న చంద్రబాబు తుమ్మిళ్ల సామర్థ్యాన్ని పెంచుకొనివ్వలేదు. నల్లమల పులినని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలదోపిడిని నివారించే విషయంలో పేపర్ టైగర్‌గా మిగిలిపోయారు. బొల్లపల్లిలో 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ వల్ల నల్లమల అడవి మునిగిపోయే ప్రమాదం ఉంది. దీనిపై తెలంగాణ జాగృతి తరఫున కోర్టులను ఆశ్రయిస్తా. ముఖ్యమంత్రికి సవాలు చేస్తున్నా… మీరు నిజంగా నల్లమల పులి బిడ్డ అయితే బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదు. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం డిమాండ్ చేయాలి. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని లేఖలు రాసినా ప్రాజెక్టు ఆగదు. ప్రాజెక్టు ఆగాలంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం లొల్లి పెట్టాలి అని కవిత సూచించారు.
ఆపరేషన్ కగార్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపాలి. ప్రభుత్వాలు ఈ మారణకాండను ఆపాలి.. మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఎన్కౌంటర్లో చెందిన గాజర్ల రవి మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం తెలిపారు.