హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన ‘కోర్ గవర్నెన్స్ మున్సిపల్ బిల్లు’ తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, స్థానిక సంస్థల గొంతును నులిమే నిరంకుశ, ‘బ్లాక్ యాక్ట్’ అని పేర్కొన్నారు. మండలిలో కోర్చట్టంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. జూలై 5న పబ్లిక్ డొమైన్లో 271 పేజీల డ్రాఫ్ట్ పెట్టి, చర్చకు వచ్చేసరికి రాత్రికి రాత్రే దాన్ని 463 పేజీలకు పెంచి సభ్యుల చేతుల్లో పెట్టారని ఆరోపించారు. 1955 చట్టాన్ని రిపీల్ చేస్తూ తెస్తున్నామన్న బిల్లులో బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పారు. డ్రాఫ్ట్ కాపీల్లో పెన్నుతో ప్రాపర్టీ టాక్స్ 20% పెంపును కొట్టేసి 10% అని రాయడం చూస్తుంటే ఇంతటి కీలక బిల్లును ఎంత అడ్డగోలుగా, డొల్లగా రూపొందించారో స్పష్టమవుతున్నదని మండిపడ్డారు. నగరాన్ని ముకలు చేసి, అభివృద్ధి మొత్తాన్ని కేవలం హైదరాబాద్ చుట్టే కేంద్రీకరిస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. అన్ని రాజకీయ ప క్షాల అభిప్రాయాలు, మేధావుల సూచనలు స్వీకరించేందుకు బిల్లును ‘సెలెక్ట్ కమిటీ’కి పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా చట్టసభల్లో ఆమోదించుకున్నా, న్యాయస్థానాల ముందుకు వెళ్లిన మరుక్షణమే ఈ డ్రాకోనియన్ చట్టం చెత్తబుట్టలోకి వెళ్లడం ఖాయమని దాసోజు హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమానికి తమ పాటలు, ఆటలతో ఊపిరి పోసిన పేదింటి కళాకారుల హకులను పరిరక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు , పెండింగ్ బకాయిల చెల్లింపుతోపాటు ఇచ్చిన హామీ మేరకు ప్రజా యుద్ధనౌక గద్దరన్న సృ్మతివనానికి నెక్లెస్‌రోడ్డులో ఎకరం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు గుర్తించి గత ప్రభుత్వం యాక్ట్ -8/2014 ద్వారా 582 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సుమారు 8,522 మంది కళాకారులను గుర్తించినట్టు మంత్రి ప్రకటించిన నేపథ్యంలో, జిల్లాల్లో ఇంకా మిగిలిపోయిన ఉద్యమకారులను గుర్తించి సాంసృతిక వారథి సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. డైరెక్టర్ ఎన్ శంకర్‌కు గత ప్రభుత్వం కేటాయించిన స్టూడియో స్థలాన్ని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.