MLA Sabitha | రంగారెడ్డి, ఏప్రిల్ 8 : కేసీఆర్ వ్యక్తి కాదు…ఓ శక్తి అని ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రరెడ్డి అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని బీఆర్ఎస్పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్తు రాష్ట్రాన్ని, మేధావులను ఏకతాటి మీదకు తీసుకువచ్చి అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందన్నారు. అబద్దపు హామీలు, మోసపూరిత ప్రకటనలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని, ప్రజలంతా మళ్లీ బీఆర్ఎస్ను కోరుకుంటున్నారని తెలిపారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్లు భారీ సంఖ్యలో హాజరు కావాలని అన్నారు. అలాగే, ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలను క్షేమంగా తిరిగి తీసుకువచ్చే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
జిల్లాను ఆదరించిన బీఆర్ఎస్ : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటారని ఆవిర్భావ సభకు కూడా అంతే రీతిలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయటమే కాకుండా ఇక నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట ప్రారంభం అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు కార్తీక్‌రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.