హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఇంట్లో శుభకార్యానికి బంధువులను పిలిచినట్టు.. ఇంటి పార్టీ రజతోత్సవాలకు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి.. కొత్తబట్టలు పెట్టి బీఆర్ఎస్ ఆత్మబంధువులను ఆహ్వానిస్తున్న ముక్రాకే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మార్గం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ ట్వీట్లో కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ పండుగకు రావాలంటూ ఆలయంలో పూజలు చేయించి ఆహ్వానపత్రికలను అందించడంలో అడుగడునా తెలంగాణ సంప్రదాయం ప్రతిబింబిస్తున్నదని తెలిపారు. కేసీఆర్‌తో నాలుగుకోట్ల ప్రజలు దశాబ్దాలుగా పెనవేసుకొన్న పేగు బంధాన్ని మీ ఆత్మీయ ప్రయత్నం నలుదిశలా చాటుతున్నదని పేర్కొన్నారు. మీలాంటి నిజమైన సైనికులే పార్టీకి శ్రీరామరక్ష అని అభినందించారు.
‘కక్షతో కాళేశ్వరం పంపులను పండబెట్టి.. నిర్లక్ష్యంతో పాలమూరు ఎత్తిపోతల పనులను పక్కన బెట్టి.. గోదారి, కృష్ణా నదులకు భారీ వరదలు వచ్చినా నీటిని ఒడిసిపట్టుకోకుండా వాడేసిన ఫలితంగానే పంటలు ఎండిపోతున్నాయి. గుక్కెడు నీళ్లులేక ప్రజల గొంతులు తడారిపోతున్నాయి’ అని కేటీఆర్ ఎక్స్‌లో ధ్వజమెత్తారు. నాడు కేసీఆర్ పాలనలో జలకళను సంతరించుకున్న వాగులు, వంకలు నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నాయని విమర్శించారు.
నాడు ఇంటింటికీ నల్లా నీళ్లు అందితే నేడు ఆడబిడ్డల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది శ్రీశైలం, సాగర్ జలాశయాలను ఏపీ సర్కారు ఖాళీచేస్తున్నా నోరెత్తని కాంగ్రెస్ సర్కారు తప్పిదమేనని విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కేసీఆర్‌పై కక్షతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపని కాంగ్రెస్ పాలన పాప ఫలితమని మండిపడ్డారు.