KP Vivekananda | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చాలా క్రమశిక్షణ కలిగిన నాయకుడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పేర్కొన్నారు. శాసనసభలో మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానం సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడారు.
మాగంటి గోపీనాథ్ క్రమశిక్షణ కలిగిన నాయకుడే కాదు.. ఆదర్శ నాయకుడు కూడా. వారు చిన్న వయసు నుంచే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. నిబద్ధతతో ప్రజా సేవ చేశారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేశారు. 1983 నుంచి 2014 వరకు వేచి చూశారు.. ఓపీకతో ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికై.. వరుసగా మూడు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా నన్ను ప్రోత్సహించేవారు. గోపీనాథ్ మరణం బాధాకరం. వయసులో ఆయన పెద్ద వారైనా.. తనను ఒక సోదరుడిగా, స్నేహితుడి లాగా చూసుకునేవారు. స్నేహానికి విలువ ఇచ్చేవారు గోపీనాథ్ అని కేపీ వివేకానంద గుర్తు చేశారు.
హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలను పరిష్కరించడంలో జట్టుగా పని చేశాం. గోపీనాథ్ మమ్మల్ని ముందుకు నడిపించారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉంది. వారు సొంత ఖర్చులతో కొన్ని పనులు నిర్వహించారు. నమ్ముకున్న వారికి, కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు గెలవడమంటే కత్తిమీద సాములాంటింది. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని కేపీ వివేకానంద పేర్కొన్నారు.