ఉప్పల్/కాప్రా, మే 8: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి అనారోగ్యంతో గురువారం హబ్సిగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హబ్సిగూడలోని నివాసానికి చేరుకొని రాజిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు.
మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు.
శుక్రవారం సాయంత్రం చీర్యాలలోని బండారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజిరెడ్డి 2009 నుంచి 2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సంతాపం తెలియజేశారు. ఉప్పల్ నియోజకవర్గానికి విశేష సేవలు అందించిన రాజిరెడ్డి మరణం విచారకరమని పేర్కొన్నారు. రాజిరెడ్డి నిబద్ధత గల ప్రజా నాయకుడిగా ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని చెప్పారు. రాజిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.