Sirikonda Prashanth | కాజీపేట, జూన్ 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్ తేల్చిచెప్పారు. భూపాలపల్లి నియోజక వర్గానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్‌తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను శుక్రవారం కాజీపేట ఆర్పిఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా సిరికొండ ప్రశాంత్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వాహనాలతో వెళుతున్న క్రమంలో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు మూసి ఉండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైలు పట్టాల వద్దకు రాగానే ఆ గేటు మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు అంతరాయం కలిగిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం రైల్వే ఆర్పిఎఫ్ పోలీసులు అక్రమ కేసులు బనాయించారన్నారు. ఆ రోజున ఎల్కతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభను ఫెయిల్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే అధికారుల మీద ఒత్తిడి పెంచి ఉప్పల్ రైల్వే గేటును దాదాపు గంటన్నర వరకు మూసి వేసారన్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుండి రైల్వే గేట్ మీదుగా సభకు వెళ్ళు వాహనాలు దాదాపు పది కిలోమీటర్ల మేర నిలిచి పోయాయన్నారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు వాహనాలు దిగి రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చారన్నారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని ప్రభుత్వాల సూచనలతో రైల్వే ఉన్నత అధికారుల ఆదేశాలతో రైల్వే ఆర్పిఎఫ్ సిబ్బంది పలువురు నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించా రని పేర్కొన్నారు. కాజీపేట ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఛటర్జీ ఆదేశానుసారం భూపాలపల్లి నియోజక వర్గానికి చెందిన ఏడుగురు నాయకులు, కార్యకర్తలు కాజీపేట ఆర్పిఎఫ్ స్టేషన్‌కు వచ్చామన్నారు. మాపై రైల్వే ఆర్పిఎఫ్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారని తెలిపారు.