RSP | అచ్చంపేట : అచ్చంపేట గులాబీ కార్యకర్తలు కొదమ సింహాలు, పెద్ద పులుల మాదిరి గర్జిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. నల్లమల్లలో చిరుతలు, పెద్ద పులులు ఉంటాయి.. వారే బీఆర్ఎస్ కార్యకర్తలు అని ఆయన పేర్కొన్నారు. అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆర్ఎస్పీ ప్రసంగించారు.
ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉన్నది.. చాలా బాధగా ఉన్నది. బాధ గురించి చెప్తా ఎందుకంటే నేను ఏ నల్లమల్ల అడవుల్లో అయితే అక్షరాలు దిద్దానో.. ఏ నల్లమల్ల అడవుల్లో అయితే నడక నేర్చుకున్నానో ఆ అడవుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఇదే వేదిక మీద పరిచయం అయ్యాను. అప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యంత క్రూరంగా ఎక్కడపడితే అక్కడ కేసులు పెడుతూ, భయపెట్టిస్తున్నా.. ఉరికంభం ఎక్కించినా సరే అని చెప్పి గులాబీ జెండాను, కేసీఆర్ను వదలం అని మీరందరూ వీరోచితంగా పోరాడారు. కానీ ఇవాళ బాధ అయితున్నది. మీకు అండగా నిలవాల్సిన నాయకుడు బాలరాజు ఇవాళ పార్టీని వీడారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎంతైతే సంతోషపడుతామో.. ఇవాళ అచ్చంపేట ప్రజలు అంత ఆనందంగా ఉన్నారని మాట్లాడుతుంటే నాకు ఆనందం కలగుతుంది. ఈ ఆత్మీయ సమావేశం అచ్చంపేటకే కాదు తెలంగాణ మొత్తానికి ఒక వార్నింగ్ ఇస్తున్నది. నల్లమల్ల అంటే పిరికి పందలే ఉండరు.. చిరుతలు, పెద్ద పులులు ఉంటారు.. వారే బీఆర్ఎస్ కార్యకర్తలు. మీ స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం, అవకాశావాదులుగా మారి, వెన్నుపోటుదారులుగా మారి బయటకు పోయి తల్లి లాంటి పార్టీ మీద రాళ్లు వేస్తే కొదమ సింహాలు, పెద్ద పులులు అయితాం అని అచ్చంపేట కార్యకర్తలు నినదిస్తున్నారు. ఇది గువ్వలకు మాత్రమే వార్నింగ్ ఇవ్వడం లేదు.. మొత్తం తెలంగాణలో గోడమీద పిల్లుల్లాగా, గోతికాడ నక్కల్లాగా కూర్చున్న వాళ్లందరికీ అచ్చంపేట ఒక దిక్సూచిగా మారింది అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.