హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, దీనికి హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన చేయకుంటే కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని కోరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యంతోనే శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంశాఖపై ఒక్కసారి కూడా సమీక్షించలేదని తెలిపారు. హోం, విద్య శాఖలకు రాష్ట్రంలో ప్రత్యేక మంత్రులు లేరని, ఈ రెండూ సీఎం తన వద్దే ఉంచుకున్నారని, ఇలాంటి కీలక శాఖలకు ప్రత్యేకంగా మంత్రులు లేకుండా ఏ రాష్ట్రమూ లేదని తెలిపారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వల్లకాడు చేయాలని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.
ఒక చెంచు మహిళను కిడ్నాప్ చేసి వారంపాటు ఆమెపై లైంగికదాడి చేశారని, పొలీసుస్టేషన్‌లో మరో మహిళ ఆత్మహత్య చేసుకున్నదని రాష్ట్రంలో శాంతిభద్రతల దిగజారిందనడానికి ఇవే నిదర్శనాలని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి 40 రోజులు అవుతున్నా దోషులను పట్టుకోలేదని, ఇంత మంది పోలీసులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 24 గంటల్లో ఐదు హత్యలు జరిగాయని, మెదక్‌లో మత కల్లోలాలు జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. సుల్తానాబాద్‌లో చిన్నారిపై లైంగికదాడి జరిగిందని, కడ్తాల్ సమీపంలో రెండు హత్యలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం కొటొచ్చినట్టు కనిపిస్తున్నా, పోలీసులు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టడంలో బిజీ గా ఉన్నారని విమర్శించారు. నాగర్ కర్నూల్ డీఎస్పీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పొలీస్ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని తెలిపారు.
కిడ్నాప్ అయి లైంగికదాడికి గురైన చెంచు మహిళకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బాలరాజు డిమాండ్ చేశారు. మరో ఘటనలో కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లోనే మహిళ విషం తీసుకుని చనిపోగా, పొలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదనడం ఆశ్చర్యంగా ఉన్నదని, దీనికి బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతభద్రతలు క్షీణిస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి రాజకీయాలపైనే ఉన్నదని ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న సీఎం ఇదే జిల్లాలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా చోద్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ర్టాన్ని గూండారాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.