RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీది ఆపన్న హస్తం కాదు మొండి చెయ్యి అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరకు ఎందరో ఎస్సీ మంత్రులున్నా, స్పీకరున్నా ఎస్సీలకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొండి ‘చేయే’ మిగులుతున్నది అని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఇట్లెన్నడూ జరగలేదు అని ఆయన గుర్తు చేశారు.
నేడు రేవంత్ ప్రభుత్వం ఎస్సీలకు ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే ఫీజు విద్యార్థులే కట్టాలంట.
ఇది కూడా కేవలం ఎస్సీలకు మాత్రమే ప్రత్యేక నిబంధన అంట. లక్ష రూపాయల ఫీజు ఎస్సీ విద్యార్థులు ఎలా కడుతారు? ఎందుకింత కోపం పేదల మీద రేవంత్ రెడ్డి..? అని ఆర్ఎస్పీ నిలదీశారు.
గత ఏడాది వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, మెయింటనెన్స్ ఫీజు అన్నిటిని ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ కింద కాలేజ్ అకౌంట్‌కి పంపేవారు. కానీ ఈ ఏడాది నుండి కాలేజీకి చెల్లించే ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులు, విద్యార్థుల అకౌంట్‌కి పంపిస్తామని చెబుతుంది. గత సంవత్సరం వరకు కాలేజీ యాజమాన్యాలు ఒక్క రూపాయి ఫీజు అడగకుండానే అడ్మిషన్ ఇచ్చేవారు. కానీ ఇపుడు EAPCET మంచి ర్యాంకు తెచ్చుకుని కన్వీనర్ కోటాలో సీటు పొందినా, ఖచ్చితంగా కాలేజీ ఫీజు కడితేనే అడ్మిషన్ ఇస్తామని చెబుతున్నారు. ఏమన్నా అంటే చూడండి ప్రభుత్వమే గైడ్ లైన్స్ ఇచ్చింది అని యాజమాన్యాలు చెబుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌లో మీరు విద్యాజ్యోతుల పథకం పెట్టింది ఇలా మోసం చేయడానికేనా అని ఖర్గేను ఆర్ఎస్పీ నిలదీశారు. కేవలం ఎస్సీలే ఏం పాపం చేశారు? వారు ఇంజనీరింగ్ చదువులు చదువద్దా? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి కోర్సులు చేయద్దా? సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం/అధికారులు చెప్పలేదు ఎందుకు? అన్ని వర్గాలను కాకుండా కేవలం ఎస్సీలకే ఈ అనాగరిక నిబంధన ఎందుకు? బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాంచందర్ రావు ఎస్సీ వర్గీకరణ చేశామని ఒక పక్క చెబుతూ, మరో పక్క ఈ ఫీజుల దోపిడీ ఏమిటీ? కేసిఆర్ ప్రభుత్వంలో ఏనాడు ఇలాంటి అన్యాయం జరగలేదు. రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు రాజీనామా చేయండి లేదా లేదా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేయండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.