హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ‘నేను మందుగుండు లాంటోణ్ని.. మీ దోపిడీ కాంగ్రెస్ దొంగల గుండెల్లో రోజూ నిద్రపోతూనే ఉంటా.. ఖబడ్దార్!’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఘాటుగా స్పందించారు. సీఎం తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బుధవారం ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీని నిలదీస్తూనే ఉంటానని హెచ్చరించారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి గారూ.. మీరు నన్ను ‘గుండు’ అని అవమానించినా, ‘బండ’ అని సంబోధించినా, ‘మతి’లేని వాడని ఎగతాళి చేసినా.. నేను భయపడబోను. మీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటా’ అని స్పష్టంచేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తనరూపాన్ని, వ్యక్తిత్వాన్ని ఎంతలా హేళన చేసినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.