మన్సూరాబాద్, జూలై 17 : యాదగిరిగుట్ట ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌ను అసభ్యపదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీ ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈశ్వరమ్మయాదవ్‌పై యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, అతడి తండ్రి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో శుక్రవారం మన్సూరాబాద్ చింతలకుంటలోని ఆమె నివాసానికి ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు వెళ్లి సంఘీభావం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి వాడుతున్న భాషనే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వాడుతున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏమన్నా నడుస్తదనే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఈశ్వరమ్మ యాదవ్‌పై రాష్ట్ర యువజన కాంగ్రెస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడి ఘటనపై దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డితో కమిటీ వేశారే కానీ అందులో బీసీ నాయకులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన బీసీ సంఘాల నాయకులు ప్రశ్నించడానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఇంటికి వెళ్తే కర్రలు, రాళ్లతో దాడులు చేసి గాయపరిచారని అన్నారు. బాధితురాలు ఈశ్వరమ్మ యాదవ్ 80 ఏండ్ల వయస్సులో తన ఇంట్లో భయం భయంగా గడుపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జక్కిడి శివచరణ్‌రెడ్డికి 1 ప్లస్ 1 గన్‌మెన్ సెక్యూరిటీ ఇచ్చి తిప్పుతున్నారని, బాధితురాలికి గన్‌మెన్ ఇవ్వకుండా నిందితుడికి ఇచ్చి సత్కరించడమేమిటని ప్రశ్నించారు. ఏ హోదా లేని శివచరణ్ రెడ్డికి సెక్యూరిటీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి హోదాలో ఉన్న ఈశ్వరమ్మ యాదవ్‌కు వెంటనే గన్‌మెన్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.