హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు భరత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదాయాన్ని మాత్రమే పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ మంత్రిని నియమించిందని, కానీ ఆరు నెలలు గడుస్తున్నా ముఖ్యమైన విద్యా రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా గ్రూప్-1 ప్రిలిమ్స్ నిష్పత్తి 1:100 ప్రకారం ఇవ్వాలని కోరిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ నిష్పత్తిని అమలు చేయకపోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. జీవో 46 ను సవరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, దగాపాలన అని ధ్వజమెత్తారు.