హైదరాబాద్, జనవరి 26 (నమస్తేతెలంగాణ): సచివాలయం పక్కన గల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి తాళాలు వేసి అవమానించడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు. దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన ఆ మహనీయుడిని నిర్బంధించడమంటే యావత్ తెలంగాణను నిర్బంధించినట్టేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అంబేద్కర్ స్ఫూర్తిని ఎవరూ నిరోధించలేరని పేర్కొన్నారు. ఓ వైపు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి.. భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడకుండా, నివాళులర్పించకుండా తాళాలు వేయడం తగదని మండిపడ్డారు. కేవలం కేసీఆర్ ఏర్పాటుచేశారనే అక్కసుతోనే విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్‌కుమార్, కిశోర్‌గౌడ్, తుంగ బాలు, రఘురాం, ఆశిష్‌కుమార్ యాదవ్, సుమిత్రా మహాజన్, సుశీలారెడ్డి పాల్గొన్నారు.