హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): నంబాల కేశవరావుది ప్రభుత్వ హత్యే అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతిపై సంతాపం ప్రకటించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వం చేసిన హత్యగానే పరిగణించాల్సి వస్తుందని తెలిపారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. పట్టించుకోకుండా ఏకపక్షంగా కాల్పులు జరిపి సాగించిన మారణకాండగా అభివర్ణించారు. మావోయిస్టులు ఆరు నెలలు కాల్పుల విరమణ ప్రకటించినా.. వారి అభ్యర్థనకు స్పందించకుండా మొండిగా వ్యవహరించి చేసిన ప్రభుత్వ హత్యలు ఇవని మండిపడ్డారు.
కేంద్రం వెంటనే కాల్పుల విరమణతోపాటు మావోయిస్టులతో చర్చలు జరపాలని శాంతిచర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్‌చేశారు. బుధవారం హనుమకొండలో శాంతిచర్చల కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జైసింగ్ రాథోడ్ అధ్యక్షతన ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ మధ్య భారతలో పోలీసులు నక్సలైట్లకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో సామాన్య ప్రజలు, అమాయక ఆదివాసీలు చనిపోతున్నారని తెలిపారు.