నల్లగొండ సిటీ, ఏప్రిల్ 4 : రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడని నల్లగొండ జిల్లా కనగల్ మండలం మార్తోనిగూడేనికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు బండమీది రామును శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కనగల్ మండలం జీ.ఎడవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి హెలికాప్టర్లో వచ్చిన విషయమై ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడని పేర్కొంటూ పోలీసులు తెల్లవారు జామున 4 గంటలకు అతడి ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలి పెట్టారు.
బీఆర్ఎస్ నాయకుడిపై క్రిమినల్ కేసు
బెల్లంపల్లి, ఏప్రిల్ 4 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ నాయకుడు నూనెటి సత్యనారాయణపై శుక్రవారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తాళ్లగురిజాల ఎస్ఐ రమేశ్ తెలిపారు. మండల శివారులోని డబుల్ బెడ్ రూం ఇండ్ల ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని బెల్లంపల్లి నియోజకవర్గం, బెల్లంపల్లి పొలిటికల్ గ్రూప్‌లలో అసత్యప్రచారం చేశారని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. అసత్యప్రచారం చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.