బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టగా.. తొలినుంచీ బీసీల పక్షాన గళమెత్తుతున్న బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సభ ఆమోదం పొందేందుకు తన వంతు సహకారం అందించింది. బీజేపీ, ఎంఐఎం, సీపీఐ కూడా అసెంబ్లీలో బీసీ బిల్లులకు మద్దతునిచ్చాయి.
హైదరాబాద్, మార్చి 17 ( నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మరోసారి అండగా నిలబడింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా తన చిత్తశుద్ధిని చాటుకున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, బీసీ కులగణన చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వచ్చింది. కులగణనలో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపుతూ రీసర్వేకు సైతం పట్టుబట్టింది. బీసీ కులసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించింది. వివిధ వేదికల మీద బీసీల గొంతుక వినిపించింది. ఈ నేపథ్యంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొదటినుంచీ బీసీలకు వారి హక్కుల విషయంలో అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ, ఈ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందేందుకు తన వంతుగా సంపూర్ణ సహకారం అందించింది.
బీఆర్ఎస్తోపాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు కూడా మద్దతు ప్రకటించడంతో ఈ బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. బీసీ రిజర్వేషన్ బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, సీపీఐ సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కూడా పొందాల్సి ఉన్నందున ప్రధాని మోదీ వద్దకు అఖిలఫక్షాన్ని తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. బిల్లును సభ ఆమోదించిన అనంతరం అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. గతంలో తొలిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్లలో 50% రిజర్వేషన్, గౌడన్నల కోసం వైన్‌షాపుల అలాట్మెంట్లోనూ రిజర్వేషన్ కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. అంతేకాకుండా, బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 37 శాతానికి పెంచాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది. అయితే, కేంద్రం వద్ద అది పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఎటువంటి భేషజాలకు పోకుండా, బీసీ హక్కుల పరిరక్షణ ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో సంపూర్ణ సహకారం అందించడం అభినందనీయం.
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. ఈ బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందినప్పుడే వారంతా సంతోషపడతారని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతోపాటు కేంద్రంలో, పార్లమెంట్లో పోరాటానికి బీఆర్ఎస్ కలిసి వస్తుందని ప్రకటించారు. తమకున్న నలుగురు రాజ్యసభ ఎంపీలు కూడా ఏకగ్రీవంగా మద్దతిస్తూ ఓటేస్తారని తెలిపారు. ఈ బిల్లు పాస్ కావాలంటే, 100 మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీపై కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ బిల్లుకు సంబంధించి తమ పార్టీ తరఫున ఎక్కడా తప్పుదోవ పట్టించడం లేదని స్పష్టంచేశారు. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా మూడు సవరణలను చేసి ఆమోదించాలన్న బీఆర్ఎస్ డిమాండ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పుడు కేవలం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల బిల్లుపై మాత్రమే చర్చిద్దామని, ఇతర అంశాలపై తర్వాత చూద్దామని చెప్పారు. ఇదేమైనా బిల్లులో పెట్టే అంశమా? వాటికి ఈ బిల్లుకు ఏం సంబంధం? అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
కేంద్రంలో నాలుగు దశాబ్దాలపాటు బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది కాంగ్రెస్సేనని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున కేపీ వివేకానంద మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీసీల వెనుకుబాటుకు కారణం కాంగ్రెస్సేనని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ, 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పారు. ఈ బిల్లుకు కోర్టుల్లో న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 37 శాతానికి పెంచే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, తాము చిత్తశుద్ధితో పనిచేశామని వివరించారు. సాక్షాత్తు కాంగ్రెస్ నాయకులే బీసీ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. 1980లో మండల్ కమిషన్ నివేదిక సమర్పిస్తే, 1980 నుంచి 1990 వరకు ఆ నివేదికను చెత్తబుట్టలో వేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలుచేయడానికి ప్రయత్నిస్తే, 1990 ఆగస్టు 7న రాజీవ్‌గాంధీ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారని, దీనిని దేశ విభజన కుట్రగా అభివర్ణించారని గుర్తుచేశారు.
ఒక్క తమిళనాడు మినహా ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్ల పెంపు సాధ్యపడలేదని, అనేక రాష్ర్టాలు చేయలేకపోయాయని కేపీ వివేకానంద గుర్తుచేశారు. కులగణనలో పాటించాల్సిన ప్రక్రియ ముఖ్యమైనదని, ప్రొఫెసర్లు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, శాస్త్రీయంగా లేదని, అనేక లోపాలున్నాయని చెప్పారు. తక్షణమే న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ శాస్త్రీయత, కోర్టుల్లో నిలబడుతుందా? ఈ చట్టం కోర్టుల్లో నిలబతుందా? కేంద్రం ఒప్పుకుంటుందా? అనే అనుమానాలున్నాయని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ముందే ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగావకాశాలపై అధ్యయనాన్ని బీసీ కమిషన్ చేత చేయించకపోవడం బీసీ కమిషన్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. బూసాని వెంకటేశ్వర్లు ఏకసభ్య కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టలేదని, కులాల వారీగా లెక్కలు ఎందుకు బయటపెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సామాజిక, విద్య వెనుకబాటు తనంపై తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉండేననని కేవీ వివేకానంద్ ప్రభుత్వానికి సూచించారు. ‘తులనాత్మక అధ్యయనం కోసం బీసీ కమిషన్‌కు ప్రభుత్వం టర్మ్ ఆఫ్ రిఫెరెన్స్ ఇవ్వాలి. 1994లోని పాత బీసీ కమిషన్ యాక్ట్‌ను సవరించాలి. నూతన కేంద్ర బీసీ కమిషన్ యాక్ట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించి, సిబ్బందిని కేటాయించి. శాస్త్రీయ అధ్యయనం చేయించాల్సి ఉండే. తులనాత్మక అధ్యయనం తర్వాత, నివేదిక అందిన తర్వాత ఈ నివేదికను శాసనసభ, శాసనమండలిలో చర్చపెట్టి, ఆమోదించి, చట్టం చేసి, కేంద్రానికి పంపించి, 9వ షెడ్యూల్లో చేరాల్చి ఉండే’నని అభిప్రాయపడ్డారు. మనం కేంద్రం మీద యుద్ధానికి వెళ్తున్నామని, అన్ని రకాల అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకోవాలని సర్కారుకు సూచించారు.
విద్య, ఉపాధి, ఉద్యోగరంగాలతోపాటు స్థానికసంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టం చేయడానికే పరిమిత కాకుండా, అది చెల్లుబాటయ్యేలా కూడా చూడాలని ప్రభుత్వానికి బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభ్యులు సూచించారు. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంపు బిల్లుపై అసెంబ్లీలో సోమవారం కొనసాగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐంఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు ఆయా పార్టీల తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకు సమన్యాయం జరగాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు తీర్పును, సాంకేతిక కారణాలను చూపవద్దని, రాష్ట్ర పరిధిలోని పోస్టుల్లోనైనా రిజర్వేషన్లను అమలు చేయాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా, శాస్త్రీయ గణాంకాలతో సుప్రీంకోర్టును ఒప్పిస్తే చట్టం అమలు సాధ్యమేనని, అందుకు ఎస్సీ వర్గీకరణ తీర్పు నిదర్శమని ఉదహరించారు. చట్టం చేసి కేంద్రానికి పంపించి, ఆ తరువాత ఇతరులపై ఆరోపణలు చేయవచ్చనే ఆలోచనలు చేయవద్దని హితవు పలికారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం జరగాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సైతం 100% కృషి చేసిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు ప్రైవేట్రంగంలోనూ రిజర్వేషన్లను కల్పించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల చట్టం అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని, న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వం చొరవ చూపాలని, అందుకోసం లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు.
డీలిమిటేషన్ పేరిట కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణ భారత్‌పై కుట్రలు చేస్తున్నదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టి దక్షిణ భారతదేశంలోని ఎంపీల సంఖ్యను కుదించే కుట్రలకు తెరలేపిందని దుయ్యబట్టారు. బీసీల రిజర్వేషన్లను చీల్చి, ముస్లింలకు ఇస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ విభజన వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీసీల హక్కుల సాధనకు ఎంఐఎం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దక్షిణ భారత్‌పై కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకు డీలిమిటేషన్‌పై కూడా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని సూచించారు.
ప్రభుత్వ టెండర్లలోనూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తమిళనాడు తరహాలో న్యాయపరంగా సమస్యలు లేకుండా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రిజర్వేషన్లు సాధించుకునే వరకు కేంద్ర వెంటపడాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ పని చేయకపోతే, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక రిజర్వేషన్లు చేయించుకుంటామని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లు శిలాశాసనమవుతుందని, అసమానతలను రూపుమాపుతుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఆశాభావం వ్యక్తంచేశారు. తమిళనాడు తరహాలో ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు విషయంలో అన్ని పార్టీల్లోని బీసీ నేతలు ఏకం కావాలని, ఎవరికి భయపడొద్దు.. తలదించుకోవద్దని సూచించారు. బానిన బతుకులింకెన్నాళ్లు? అంటూ ప్రశ్నించారు.
బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని మంత్రి సీతక్క ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. బీసీ కులగణన చేసిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి కూల్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు, ఈటల రాజేందర్ బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్తున్నారని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం, పార్లమెంట్లో బిల్లు పాస్ కోసం ఆమరణ దీక్ష చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారని, అందుకు తాను సిద్ధమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రకటించారు. అసెంబ్లీలో 50 నుంచి 60 మంది బీసీ ఎమెల్యేలు ఉండాల్సి ఉండగా, 19 మంది మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు కలిసి రావాలని కోరారు.
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లులపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పదే, పదే అడ్డుతగులుతుండటంతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందిస్తూ, ‘మా మామ నన్ను కనికరిస్తలేడు’ అంటూ ఆసక్తికర వ్యాఖలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు మామ అవుతారని, కనీసం చుట్టంగానైనా కనికరిస్తలేరని వ్యాఖ్యానించారు. ‘ఈ బిల్లు విషయంలో ఎట్లా చిక్కులొస్తాయో, ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. ఆయా లోటుపాట్లు సరిదిద్దడంలో భాగంగానే పలు అంశాలను లేవనెత్తుతున్నా. మంత్రి పొన్నంకు అవమానం జరిగితే నాకూ అవమానం జరిగినట్టే’ అని వ్యాఖ్యానించారు. దీనిపై పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ‘రేపు పొద్దున మీ ఇంటికొస్తా.. మీ ఇంటికొస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారనుకుంటే, మీ మామ.. అదే మా అన్నగారికి ఇంటికొస్తా. ఇద్దరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. చర్చించుకుందాం’ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): బీసీల కోసం బీసీ రిజర్వేషన్ల బిల్లుతో సంబంధం లేకుండా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చేయడానికి వీలున్న మూడు అంశాలపై తీర్మానం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రానికి వెళ్లి పార్లమెంట్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అయితే, ఈ బిల్లుతో సంబంధం లేకుండా మీ చేతుల్లోనే ఉన్న మూడు పనులు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తొలిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్లలో 50% రిజర్వేషన్లు, గౌడన్నల కోసం వైన్‌షాపుల అలాట్మెంట్లోనూ రిజర్వేషన్ తెచ్చిందని గుర్తుచేశారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకే బీసీలపై చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ ఉంటే మూడు అంశాలు చేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి బిల్లులో సవరణలు సూచించారు. బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలని, బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్టీలకతీతంగా తరలివెళ్లి ప్రధానమంత్రి మోదీని కలుద్దామని అన్ని రాజకీయ పార్టీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇందుకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు నాయకత్వం వహించాలని, ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు అఖిలపక్ష పార్టీల నేతలు కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి సోమవారం లేఖ రాశారు. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని, అందులో భాగంగానే తాము అధికారం చేపట్టగానే కులగణన ప్రక్రియను మొదలుపెట్టామని వివరించారు. సర్వేలో మొదటగా 3.54 కోట్ల మందిగా పాల్గొన్నారని, రీ సర్వేలో 21,715 కుటుంబాలు, 73,205 మంది పాల్గొని వివరాలు అందించారని, మొత్తంగా 3.55 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నారని వివరించారు.
సర్వేలో బీసీల శాతం 56.36% అని తేలిందని, ఈ లెక్కనే 100% కరెక్టని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లుకు సహకరించి, సంపూర్ణ మద్దతు ప్రకటించిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపిందని, ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుని 42 శాతానికి పెంచుతూ కొత్త ప్రతిపాదన పంపిస్తున్నామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు అఖిలపక్ష నాయకులందరం కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దామని, చట్టం అమలుకు అవసరమైన చర్యలు తీసుకుందామని చెప్పారు. అందరూ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని కలుద్దామని, బీజేపీ నేతలు, బీజేపీ మంత్రులు చొరవ తీసుకుని చట్టసభల్లో బలహీనవర్గాల సీట్లను పెంచేందుకు నాయకత్వం వహించాలని కోరారు. బీజేపీ నేతలకు లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కూడా కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుదామని, రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ తీసుకొనే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అప్పగిస్తున్నామని వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించే విధంగా ముందుకు పోదామని తెలిపారు.