Karne Prabhakar | అసెంబ్లీ ఎన్నికల్లో తుపాకీ రాముడిలా హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో అభాసుపాలయ్యారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. షాబాద్ రైతు ధర్నా చూసి రాష్ట్ర ప్రభుత్వం భయ పడిందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకు వస్తున్నారంటేనే భయ పడుతున్నారని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ దీక్షలు చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తుందన్నారు.
నల్లగొండ రైతు దీక్షకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని , తమకు హైకోర్టు అనుమతి ఇస్తుందని నమ్మకం ఉందని కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈడీ ఆఫీసు ముందు, రాజ్‌భవన్ ముందు ధర్నా చేశారని గుర్తు చేశారు. నల్లగొండ క్లాక్ టవర్ వద్ద కొన్ని దశాబ్దాలుగా పలు దీక్షలు చేశారన్నారు. మంత్రి కోమటిరెడ్డి కూడా నల్లగొండ క్లాక్ టవర్ వద్ద దీక్ష చేశారన్నారు. రాజకీయ కారణాలతోనే రైతు ధర్నాకు అనుమతి నిరాకరించారన్నారు. సీఎం హోదాలో రాజ్‌భవన్ ముందు రేవంత్ రెడ్డి ధర్నా చేశారన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీసు ముందు ధర్నా చేశారని కర్నె ప్రభాకర్ చెప్పారు. కంచెలు తీసేస్తామని మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల చుట్టూ కంచెలు వేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆంక్షలకు బీఆర్ఎస్ భయ పడితే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఎన్నికల హామీలు నెరవేరిస్తే గ్రామ సభలకు పోలీసు బందోబస్తు ఎందుకు అని ప్రశ్నించారు. అన్ని వర్గాల తరపున కేటీఆర్ గళం విప్పుతుంటే సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. గ్రామ సభల్లో రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని స్పష్టం చేశారు. తెలంగాణ సరిహద్దులు అల్లకల్లోలంగా మారుతున్నాయన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.