దండేపల్లి, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణు లు, రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రా వు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బోనస్ కింద ఇంకా 98 శాతం డబ్బులు రావాల్సి ఉన్నదని అన్నారు. కనీసం గ్రామానికొకరికి కూడా బోనస్ వేయని ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. బోనస్ పేరిట బోగస్ మాటలు చెప్పి న ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో సన్న వడ్లకు ఇంకా రూ.7.5 కోట్ల బోనస్ రావాల్సి ఉన్నదని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు.