హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వివాదాస్పదమైన సోం డిస్టిలరీ సంస్థ కమీషన్లపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఆ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీ విరాళాలు తీసుకోవడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ‘సోం’ డిస్టిలరీ నుంచి మూడుసార్లు రూ. 25 లక్షల చొప్పున తీసుకున్నదని చెప్పారు. ఒకసారి ఏకంగా రూ.1.31 కోట్లు సోం డిస్టిలరీ నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందాయనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. నకిలీ మద్యం సంస్థ అయిన ‘సోం’ డిస్టిలరీకి వకాల్తా పుచ్చుకొని మంత్రి తన లేఖలో ఆ సంస్థ గొప్పతనాన్ని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. వారం ముందే ఇలాంటి వ్యాపారాలు తెలంగాణ రాష్ట్రంలో వస్తలేవని చెప్పి, వారం తిరగకముందే బీఆర్ఎస్ బయటపెట్టిన అనంతరం ఆ కంపెనీ గురించి గొప్పలు ఎలా చెప్తారని నిలదీశారు. ‘సోం’ డిస్టిలరీకి వ్యాపా రం కట్టబెట్టారంటేనే కాంగ్రెస్‌కు కమీషన్ ముట్టినట్టు తెలుస్తున్నదని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, అప్పటివరకు ‘సోం’ డిస్టిలరీ సంస్థకు తెలంగాణలో మద్యం అమ్మే అనమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని లేని పక్షంలో ఈ డీల్ కుదరడంలో సీఎం రేవంత్ పాత్ర కూడా ఉన్నదని భావించవలసి వస్తుందని చెప్పారు.
వాస్తవాలు రాస్తే పరువునష్టమా?
ఈ నెల 21న గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి జూపల్లి .. తెలంగాణలో కొత్తగా వ్యాపారం చేయడానికి మద్యం కంపెనీలు కొత్త ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పారని క్రిశాంక్ గుర్తుచేశారు. అలా ప్రచారం చేసే మీడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని బెదిరించారని తెలిపారు. తాను ఈ నెల 27న తెలంగాణ భవన్లో జూపల్లి అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ సోం డిస్టిలరీస్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతివ్వడంపై మీడి యా సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. దానికి జవాబుగా మంత్రి జూపల్లి ఈ నెల 28 న ప్రకటన విడుదల చేసి.. ‘సోం’ డిస్టిలరీస్‌కు అనుమతులివ్వడం వాస్తవమేనని ఒప్పుకున్నారని చెప్పారు. నకిలీ మద్యం అమ్మే సంస్థ తెలంగాణలో వ్యాపారం మొదలు పెడుతుంటే.. సమాచారం లేదని మంత్రి అనడం బాధ్యతారహితం అని ఎద్దేవా చేశారు. ‘సోం’ డిస్టిలరీస్‌కు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ వారే అనుమతులు ఇచ్చారనడం హాస్యాస్పదమన్నారు. నకిలీ మ ద్యంతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు.