రఘునాథపాలెం, జూన్ 18: ఖమ్మం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ నేత కర్నాటి కృష్ణను ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీ పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే ఆకస్మికంగా ఇంటికొచ్చిన పోలీసులు.. విచారణ పేరుతో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
అక్రమంగా అరెస్ట్ చేసిన తమ నాయకుడిని తక్షణమే విడుదల చేయాలని ఖమ్మం ఏసీపీ రమణమూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా మచ్చలేని నాయకుడిగా పేరున్న 41వ డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెడుతున్నదని విమర్శించారు.
ఎన్నెస్పీ కాలువ నిర్మాణంలో భాగంగా నాటి ప్రభుత్వం కర్నాటి కృష్ణ సొంత భూమిని తీసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎన్నెస్పీ కాలువ గట్టుపై నివసిస్తున్న అనేక మంది పేదలు ఆ స్థలాల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, తమ పార్టీ నేత కృష్ణ కూడా 59 జీవో కింద రెగ్యులరైజేషన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. కృష్ణ పొజిషన్లో లేని కారణంగా ఇప్పటికే తిరస్కరించినట్టు చెప్పారు.
అసలు దరఖాస్తు చేసుకోవడమే తప్పంటూ ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి దరఖాస్తులు తిరస్కరణకు గురైతే ఆ దరఖాస్తులన్నీ అక్రమమేనా? వారందరినీ అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. 59 జీవో కింద 3 వేలకు పైచిలుకు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, వారిని కూడా అరెస్టు చేస్తారా? అంటూ నిలదీశారు. కర్నాటి కృష్ణ అరెస్ట్ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు తెలిపారు. ఆందోళన చేసిన వారిలో కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు డోకుపర్తి సుబ్బారావు, బత్తుల మురళి, బిచ్చాల తిరుమలరావు తదితరులు ఉన్నారు.
కర్నాటి కృష్ణ అరెస్టు తిరస్కరణ 
ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడనే ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకుడు, కేఎంసీ 41వ డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖమ్మం మూడో అదనపు న్యాయస్థానం తప్పుపట్టింది. ముందస్తు నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేసిన విధానం చట్టబద్ధంగా లేదని పోలీసులను కోర్టు మందలించింది. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్ స్వామి ఫిర్యాదు మేరకు ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులు కర్నాటి కృష్ణపై కేసు నమోదు చేశారు.
మంగళవారం తెల్లవారుజామున ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేశారు. ఈ అరెస్టును తప్పుపడుతూ బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు బిచ్చాల తిరుమలరావు, మేకల సుగుణారావు, దిలీప్‌చౌదరి, తన్నీరు లలిత, చింతల వెంకటేశ్వర్లు ఖమ్మం కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. కర్నాటి కృష్ణ అరెస్టు సరైనది కాదని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి కేసు వేయాలని పోలీసులను ఆదేశించింది. కేవలం రాజకీయ కక్షతోనే కర్నాటి కృష్ణను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయించేందుకు కుట్ర పన్ని విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.