హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కార్మికుల సమస్యల పరిషారం కోసం బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు రామగుండంలో ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లాభాల్లో పూర్తి వాటా, డిపెండెంట్ ఉద్యోగాలు, జీవో-76 అమలు, సింగరేణి ఎన్నికల నిర్వహణ, బకాయిల చెల్లింపు, సంస్థను ప్రైవేటీకరణ నుంచి కాపాడటం వంటి ప్రధాన డిమాండ్లపై ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
గురువారం ఆయన తెలంగాణభవన్‌లో తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో పూర్తి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి దసరా సమీపిస్తున్నా లాభాలను ప్రకటించకపోవడం ఏందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులకు 32% వరకు లాభాల వాటా అందించామని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2024-25లో 12.5% వాటా మాత్రమే ఇచ్చారని, ఈ ఏడాది లాభాల ప్రకటన, వాటా పంపిణీపై స్పష్టత లేదని విమర్శించారు.
సింగరేణిలో నిజాయితీగా పనిచేసే అధికారులు, సమర్థులైన డైరెక్టర్లను తొలగించారని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంధువులకు సంబంధించిన వారికి టెండర్లు కట్టబెట్టారని విమర్శించారు. సింగరేణికి ప్రభుత్వం, జెన్కో నుంచి రావాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయని, మొత్తం చెల్లింపులు దాదాపు రూ.50 వేల కోట్ల వరకు నిలిచిపోయాయని ఆరోపించారు. సింగరేణి వద్ద రూ.6,323 కోట్ల లాభాలు ఉన్నప్పటికీ వాటాను పంచకుండా బ్యాంకుల్లో ఉంచారని, అలాంటప్పుడు మరో రూ.4 వేల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఎందుకు తీసుకురావాల్సి వస్తున్నదని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు కూడా అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా తగ్గడం వల్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నదని అన్నారు. పరిస్థితిని చకదిద్దేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికుల ఇండ్లకు హకులు కల్పించే జీవో-76 విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. 2019లో కేసీఆర్ కార్మికులకు ఇంటి హకులు కల్పించే ఉద్దేశంతో జీవో తీసుకొచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి ప్రాంతంలో సుమారు 30 వేల ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోను పకనబెట్టి భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. మూడేండ్ల్లపాటు ఈ అంశంపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ‘బిగ్ రిలీఫ్’, ‘కార్మికులకు శుభవార్త’ అంటూ ప్రచారం చేసుకోవడం సరికాదని చెప్పారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో-76 కింద మిగిలిన కార్మికులకు వెంటనే సేల్‌డీడ్ ద్వారా హకులు కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి అర్హులైన వారికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఇలా 16 వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు మరో 4 వేల మందికి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించామని, మొత్తంగా 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించిందని, వెంటనే మెడికల్ బోర్డులు నిర్వహించి అర్హులైన వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలను కూడా ప్రభుత్వం వెంటనే నిర్వహించాలని కోరారు.
సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలు, చర్యలను బీఆర్ఎస్ సహించబోదని హరీశ్‌రావు హెచ్చరించారు. సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త గనులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కొత్త గనులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంస్థ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, బాల్క సుమన్, రేగా కాంతారావు, దుర్గం చిన్నయ్య, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో సింగరేణి లాభాలు వరుసగా తగ్గుతున్నాయని హరీశ్‌రావు చెప్పారు. 2024-25లో రూ.6,394 కోట్ల లాభాలు రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమకు ఉన్న సమాచారం ప్రకారం రూ.1,800 కోట్లను కూడా మించకపోవచ్చని అన్నారు. పరిపాలనా వైఫల్యం, అవినీతి, బంధుప్రీతి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కార్మికుల శ్రమతో ఉత్పాదకత పెరుగుతున్నా, ప్రభుత్వ నిర్ణయాలు సంస్థను నష్టాల దిశగా తీసుకెళ్తున్నాయని విమర్శించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కూడా 12 మిలియన్ టన్నుల మేర తగ్గిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉత్పత్తి పెరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు తగ్గిందో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.