సత్తుపల్లిటౌన్, డిసెంబర్ 30: సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం డాబాబజార్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని డాబాబజార్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి స్థలంలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో సోమవారం పంచాయతీ సిబ్బంది సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆరు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సుబ్బారెడ్డి కక్ష సాధింపుతో అధికారులతో సీసీ రోడ్డు నిర్మింపజేసేందుకు గ్రామ పంచాయతీ నిధులతో గ్రావెల్ తోలించారు. తన సొంత స్థలంలో రోడ్డు ఎలా వేస్తారంటూ శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. అయినప్పటికీ ఇదే విషయంపై కాంగ్రెస్ నేత సుబ్బారెడ్డి తనకు ఉన్న పలుకుబడితో సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాసరెడ్డిపై తప్పుడు ఫిర్యాదు చేయించాడు. శ్రీనివాసరెడ్డిని, అతడి భార్యను, అతడి కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తన స్థలంలో సీసీ రోడ్డు నిర్మింపజేసేందుకు వారిని పోలీసులు బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో శ్రీనివాసరెడ్డి ఆవేదనకు గురయ్యాడు. సోమవారం ఉదయం పోలీసు బందోబస్తుతో సుబ్బారెడ్డి ఆ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభింపజేయడంతో తనకు న్యాయం జరగదని భావించిన శ్రీనివాసరెడ్డి.. తాను చనిపోయిన తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని కోరుకుంటూ పురుగుమందు తాగాడు. స్థానికులు గమనించి అతడిని సత్తుపల్లి ప్రభుత్వ దవాఖానలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.