వైరాటౌన్, జనవరి 18 : గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన నిర్మాణ దశలో కూలిపోవడంతో ముగ్గురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా సోమవరం గ్రామం వద్ద మధ్యాహ్నం అండర్ పాస్ వంతెనకు స్లాబ్ వేశారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ముగ్గురు కూలీలకు స్వల్ప గాయాలు. కాగా కూలీలకు పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్లాబ్ వేసిన గంటల వ్యవధిలోనే కూలిపోవడంతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.