హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల సవర+ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కసరత్తుకు సర్కారు బ్రేకులు వేసింది. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపు లేనట్టేనని తేలిపోయింది. ఈ విద్యాసంవత్సరంలో పాత ఫీజులే ఉండనున్నాయి. జూలైలో కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, పాత ఫీజుల ప్రకారమే సీట్లను భర్తీచేయనున్నారు.
సబ్ కమిటీతో అధ్యయనం
టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదిత ఫీజులపై సమగ్ర అధ్యయనం చేయాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. సబ్ కమిటీ ఏర్పాటు బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలికి అప్పగించారు. ఫీజుల ఖరారు కోసం బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో టీఏఎఫ్ఆర్సీ సమావేశమైంది. చైర్మన్ జస్టిస్ గోపాల్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫీజుల సవరణపై ఈ సమావేశంలో చర్చించారు. టీఏఎఫ్ఆర్సీ ఇప్పటికే పలు కాలేజీల ఫీజులను ఖరారు చేయగా, కొన్ని కాలేజీల్లో ఫీజులు అసాధారణంగా పెరిగాయి. అయితే ఆయా ఫీజుల సవరణపై మరోమారు అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యాకోర్సుల ఫీజుల సవరణకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్టేనని చెప్తున్నారు.
భారం భరించలేకే?
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఇప్పటికే దాదాపు రూ. 8 వేల కోట్ల బకాయిలున్నాయి. ఈ బకాయిలను చెల్లించలేక సర్కారు సతమతమవుతున్నది. వీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పాత ఫీజుల ప్రకారమైతే సర్కారుపై ఏటా రూ. 2,400 కోట్ల భారం పడుతున్నది. ప్రతిపాదిత ఫీజులతో సుమారుగా రూ. 500-800కోట్ల వరకు భారం పడే అవకాశమున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఉన్న రూ. 8 వేల కోట్లకు తోడు కొత్తగా పెరిగేవి కలుపుకొంటే సర్కారుపై ఏటా మూడు వేల కోట్ల భారం పడుతుంది. ఒకసారి పెంచితే మూడేండ్ల పాటు ఈ భారాన్ని భరించాల్సిందే. మూడేండ్ల తర్వాత మళ్లీ ఈ ఫీజులను బట్టే కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బకాయిలు చెల్లించలేక సర్కారు సతమతమవుతుండగా, కొత్త ఫీజులతో సమస్యలు తప్పవని భావించి కాలయాపనకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు కాలేజీల యాజమాన్యాలు అనుమానిస్తున్నాయి.