ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్నల నిల్వలు పేరుకు పోతున్నాయి. రెండు రోజుల పాటు కొనుగోళ్లు చేపట్టిన సిబ్బంది, పలు కారణాలు చూపుతూ తిరిగి నాలుగు రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా, రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి.
ఆదిలాబాద్, మే 12 ( నమస్తే తెలంగాణ) ; నిల్వలు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా..ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల విక్రయానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ఇండ్లు, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో పంటలు నిల్వచేసుకుంటున్నారు. పది రోజుల కిందట జొన్న పంట కొనుగోళ్లు ప్రారంభంకాగా, ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ రాకపోవడంతో ఐదు రోజుల ఆలస్యంగా పంట సేకరణ ప్రారంభించారు. మద్దతు ధర క్వింటాకు రూ. 3699 ఉండగా, గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకటించి జొన్నలు కొనుగోళ్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో రెండు రోజులు పంట కొనుగోలు చేసి, నిల్వలు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాల నిర్వాహకులు నాలుగు రోజుల పాటు పంట కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తమ పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు నిరాశ మిగిలింది. కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలియని రైతులు వాహనాల్లో జొన్నలను విక్రయించడానికి మార్కెట్‌యార్డుకు తీసుకువస్తున్నారు.
మార్కెట్‌యార్డుల్లోనే సంచులు
ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో పంట కొనుగోళ్లు జరుగుతుండగా, 20 వేల క్వింటాళ్ల వరకు పంట సేకరించారు. రైతుల వద్ద నుంచి మద్దతు ధరతో సేకరించిన పంటను 50 కిలోల సంచుల్లో నింపుతారు. వీటిని లారీలు, వ్యాన్లలో లోడ్ చేసి సీడబ్ల్యూసీ, ఇతర గోదాముల్లోకి తరలించి నిల్వచేస్తారు. రవాణాపరమైన సమస్యల కారణంగా జొన్న సంచులను తరలించడంతో జాప్యం జరుగుతుంది. లారీలు, వ్యాన్లు దొరకకపోవడం, లోడింగ్, అన్లోడింగ్ చేసే హమాలీల కొరత ఉండటంతో జొన్న సంచుల మార్కెట్‌యార్డుల్లోనే రోజుల తరపడి ఉంటున్నాయి. వీటితో పాటు గోదాంలు ఖాళీగా లేకపోవడం సైతం సమస్యగా మారింది. జొన్నల కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు జొన్నలను క్వింటాకు రూ.2500 కొనుగోలు చేస్తున్నారు. రైతులు యాసంగిలో పండించిన శనగ కొనుగోళ్లను ప్రభుత్వం సగంలోనే నిలిపివేయడంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రైతులు పండించిన మొత్తం జొన్న పంటను కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.