దీపారాధన మన సంప్రదాయంలో ముఖ్యమైన క్రతువు. నిత్య దీపారాధన చేసేవాళ్లతో పాటు శుక్రవారాలు, శనివారాలు.. ఇలా నచ్చిన రోజుల్లో దీపం వెలిగించేవారూ ఉంటారు. ఇక పండుగలు, నోములు, వ్రతాలప్పుడు దీపాన్నీ ఓ అలంకరణగా చూస్తాం. అలాంటి సందర్భాలకు అందాన్ని తీసుకొచ్చేలా ‘ స్టెప్ బ్రాస్ దియా’ పేరుతో ఇత్తడి మెట్ల దీపాలు దొరుకుతున్నాయి.
ఇత్తడి మెట్లతో కూడిన స్టాండు మీద దీపారాధన కుందులు బిగించి ఉంటాయి. రెండు స్టెప్ల నుంచి అయిదారు స్టెప్ల దాకా దొరుకుతున్నాయి. పూజా మంటపం పక్కనే వీటిని పెట్టి నూనె పోసి దీపాలు వెలిగిస్తే చాలు. ఎంతో అలంకరణ చేసినట్టు కనిపిస్తుంది. పండుగ నాడు కొత్త కళ కావాలను కుంటే తప్పక ప్రయత్నించవచ్చు. ఈ మధ్య ఆన్లైన్లోనూ విక్రయిస్తున్నారు.