హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనంలోని కల్యాణ మండపాన్ని వివిధ శుభకార్యాలకు అద్దెకు ఇవ్వనున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు ఉచితంగా ఇస్తామని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన బ్రాహ్మణ సదనంలో మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సదనం వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందినట్టు తెలిపారు. కల్యాణ మండపాన్ని మత, ఆచార, సంప్రదాయపరమైన కార్యక్రమాలతోపాటు లౌకికపరమైన కార్యక్రమాల నిర్వహణకు కూడా కేటాయిస్తామని చెప్పారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు మొదటి ప్రాధాన్యం, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న బ్రాహ్మణులకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు. బ్రాహ్మణేతర హిందువులు సైతం కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కేటాయింపులో ప్రాధాన్యం, అద్దె నిర్ధారణకు తహశీల్దార్ జారీచేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. అశుభ కార్యక్రమాల నిర్వహణకు సదనాన్ని కేటాయించరాదని, శాఖాహార వంటకాలను మాత్రమే ప్రాంగణంలో అనుమతించాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుభకార్యాల నిర్వహణకు పురోహితులతోపాటు క్యాటరింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. నెల ముందుగా ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, వివరాలకు Brahminparishad.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో బ్రాహ్మణ పరిషత్తు పాలనాధికారి రఘురామశర్మ తదితరులు పాల్గొన్నారు.