హైదరాబాద్, హిమాయత్‌నగర్, జూన్ 8: రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లో సంఘం అధ్యక్షుడు రాజేశ్వర శర్మ, ప్రధాన కార్యదర్శి ఉప్పల బాలసుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడుతూ ‘బ్రాహ్మణుల జనాభా లెక్కలను తేల్చాలి. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్స్ పోస్టుల్లో బ్రాహ్మణులనే నియమించాలి. బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలి. దూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రక్షాళన చేయాలి’ అని కోరారు. విలేకరుల సమావేశంలో సంఘం మహిళా విభాగం కన్వీనర్ అర్పిత, నాయకులు చక్రవర్తిశర్మ, వేమవరపు వెంకటరమణ, చిన్నయ్య శర్మ, పాపయ్య శర్మ, కేశవనాథ శర్మ, ప్రకాశ్‌శర్మ పాల్గొన్నారు.