నర్సాపూర్, మే 29 : మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తమ పనులు కావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వెళ్తే రేపు, మాపు అంటూ తిప్పి పంపిస్తున్నారని వాపోతున్నారు. కార్లలో వచ్చే బడాబాబులకు మాత్రం కూర్చోపెట్టి మరీ పనులు చేయించి పెడుతున్నారని, పేద రైతులు వస్తే పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు ఆకుల కృష్ణమూర్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈయనకు బ్రాహ్మణపల్లిలోని 247/అ(3) సర్వే నంబర్లో 16 గుంటల భూమి వారసత్వంగా వచ్చింది. ఇక్కడే అతనికి సమస్య వచ్చిపడింది. ఈ 16 గుంటల పట్టాభూమి అసైన్డ్ భూమిగా పాస్‌బుక్‌లో నమోదైంది. అసైన్డ్ భూమి నుంచి పట్టా భూ మిలోకి మార్చాలని ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. సమస్యను పరిష్కరించాలని కోరితే రేపుమాపంటూ తిప్పి పంపుతున్నారని తెలిపాడు. ఎన్నికల ముందుపోతే ఎన్నికల తర్వాత రమ్మన్నారని, ఇప్పుడేమో ఫలితాల తర్వాత రమ్మంటున్నా రు అని బాధిత రైతు కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశాడు. బుధవారం నేరుగా తహసీల్దా ర్ కమలాద్రి దగ్గరకు వెళ్లి తన సమస్యను చెప్పగా, పూర్తిగా వినకుండానే వచ్చే నెల నాలుగో తేదీ తర్వాత రమ్మని సూచించాడని, 6 నెలల నుంచి తిరుగుతున్నానని వేడుకు న్నా పట్టించుకోలేదని తెలిపాడు. ఎన్నికల ఫ లితాల బిజీలో ఉన్నామని, ఫలితాల తర్వాత సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ చెప్పినట్టు రైతు పేర్కొన్నాడు. తహసీల్దార్ బిజీగా ఉంటే కిందిస్థాయి అధికారులతోనైనా సమస్యను పరిష్కరించాలని ఆదేశించకుండా వెళ్లి పో అని అనడం బాధించిందని సదరు రైతు ఆవేదన చెందాడు. 10 కిలోమీటర్ల దూరం నుంచి ఎండలో పడివస్తే ఇలా తిప్పి పంపిస్తున్నారని కంటతడి పెట్టుకున్నాడు. పైగా తహసీల్దార్ కమలాద్రి రైతు కృష్ణమూర్తి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ కావడం గమనార్హం.