(స్పెషల్ టాస్క్ బ్యూరో)
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణతో ముఖ్యంగా హైదరాబాద్‌తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం రాగానే దేశ రాజధానిగా ఢిల్లీని మాత్రమే ప్రతిపాదించినప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు. రెండో రాజధాని గనుక ఉంటే అది హైదరాబాదే అయి ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ర్టాలను ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సూచించారు. ఫజల్ అలీ కమిషన్‌కు తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైనది. ఆయన రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఇందుకు ఆలంబనగా నిలిచింది.
అంబేద్కర్‌ను విశ్వసించిన నిజాం
నిజాం నవాబుకు డాక్టర్ అంబేద్కర్‌కు మంచి అనుబంధం ఉన్నది. హైదరాబాద్ రాష్ర్టాన్ని భారత యూనియన్‌లో కలపాలని కోరిన వారిలో అంబేద్కర్ ఒకరు. మైసూర్, జైపూర్, కశ్మీర్ రాజులతోపాటు నిజాం రాజుకు కూడా జీవితకాలం రాజప్రముఖ్ గుర్తింపు లభిస్తుందని నచ్చచెప్పినవారిలో అంబేద్కర్ కూడా ఉన్నారు. దీంతో అంబేద్కర్‌ను నిజాం విశ్వసించేవాడు. అంబేద్కర్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు లండన్ ప్రయాణ, వసతి ఖర్చులను నిజాం ప్రభుత్వమే భరించింది.
హైదరాబాద్‌తో అనుబంధం
హైదరాబాద్‌లో 1932 సెప్టెంబర్ 3న తొలిసారిగా అంబేద్కర్ అడుగుపెట్టారు. నిజాం ప్రభుత్వ 72వ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 1942లో మరోసారి, 1944లో నగరంలో ఎస్సీ ఫెడరేషన్ మహాసభలో పాల్గొని, చారిత్రక ప్రసంగం చేశారు. స్వాతంత్య్రానంతరం 1952లో అంబేద్కర్ సికింద్రాబాద్‌ను సందర్శించారు. సికింద్రాబాద్‌లోని పెండర్‌గాస్ట్ రోడ్డులోని అంబేద్కర్ సమకాలికుడు, అప్పటి పార్లమెంట్ సభ్యుడు జేహెచ్ సుబ్బయ్య ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. చివరిసారిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1953లో హైదరాబాద్‌ను సందర్శించారు. అప్పుడు అంబేద్కర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేసి, ఆయనను గౌరవించింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందజేసి, సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించిందని పలువురు ప్రొఫెసర్లు తెలిపారు.