హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తప్పుడు ధ్రువపత్రాలతో పాస్‌పోర్టులు పొందిన వారి వివరాల కోసం ఇటు తెలంగాణ సీఐడీ, అటు పాస్‌పోర్టు ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ఉన్నది ఒకే ఒక్క ఆధారం.. పాస్‌పోర్టు కోసం ఇచ్చిన పాస్‌ఫొటో మాత్రమే. సీఐడీ పోలీసులు గుర్తించిన 95 మంది శ్రీలంకకు చెందిన శరణార్థులు ఇప్పుడు తెలంగాణలోనే ఉన్నారా? లేక ఏదైనా దేశానికి వెళ్లారా? అనే దానిపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఒకవేళ తెలంగాణలో ఉంటే ఎక్కడ ఉన్నారు? ఆ పాస్పోర్టుతో ఏదైనా విదేశం వెళ్లారా? అని కూపీ లాగుతున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న పాస్‌పోర్టు ఏజెంట్లు ఇప్పటికీ వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారా? లేదా అనేది కూడా ఆరా తీస్తున్నారు. సీఐడీ ఇచ్చిన 95 పాస్‌పోర్టులపై ఆ శాఖ ఉన్నతాధికారులు తమ సర్వర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఫలానా పాస్‌పోర్టు పొందిన వ్యక్తి ఏ దేశం వెళ్లాడు? అసలు వెళ్లాడా? లేదా? అనేది చెక్ చేస్తున్నారు. ఒకవేళ దేశం దాటిన వ్యక్తులు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే.. ఎయిర్‌పోర్టులోనే వారిని అరెస్టు చేసేలా ఇప్పటికే సీఐడీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.