Gurukula School | గద్వాల, సెప్టెంబర్ 9 : అనాథలు, బాలకార్మికులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న అర్బన్ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈ గురుకులంలో 4 నుంచి 8వ తరగతి వరకు ఉండగా.. 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న బోరు 20 రోజుల కిందట చెడిపోగా.. వార్డెన్ మరమ్మతులు చేయించినా మళ్లీ రెండ్రోజులకే పాడైపోయింది.
ఈ విషయాన్ని ఇన్చార్జి డీఈవో దృష్టికి తీసుకెళ్లగా.. మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చి పక్షం రోజులైనా స్పందించకపోవడంతో విద్యార్థులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గురుకులం సమీపంలోనే ప్రైవేటు బోరు ఉండటంతో విద్యార్థులు ఉదయం నిద్ర లేచిందే తడవు నీటికోసం బకెట్లు పట్టుకొని పరుగులు తీస్తున్నారు. దీనికితోడు గురుకులంలో కేవలం రెండు బాత్రూంలు మాత్రమే ఉండటంతో సరిపోక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. ప్రహరీ లేకపోవడంతో రాత్రిళ్లు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.