ఖైరతాబాద్, ఫిబ్రవరి 7: జనాభా దామాషా ప్రకారం నేతకాని సామాజిక వర్గాన్ని ఎస్సీ సీ గ్రూప్ నుంచి వేరు చేసి డీ గ్రూపులో చేర్చి 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ, నేతకాని కులసంఘాల జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ బోర్లకుంట వెంకటేశ్ నేత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ వర్గీకరణలో నేతకాని సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ కులాల్లో అధిక జనాభా కలిగిన మూడో అతి పెద్దదైన నేతకాని సామాజిక వర్గానికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సిన వాటాను అందించకుండా కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. దీని వెనుక మాలల హస్తం ఉన్నదని ఆరోపించారు.
ప్రభుత్వంతో కలిసి తమపై అణచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ పంపకాల్లో నేతకానీలకు అన్యాయం జరిగిందని, వారి న్యాయబద్ధ పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తామని చెప్పారు. సమావేశంలో నేతకాని విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్, నేతకాని కుల సంఘం అధ్యక్షుడు దుర్గం రాజేశ్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనాల భువనచంద్ర, బోర్లకుంట దీపక్‌కుమార్, దుర్గం శేఖర్, వినోద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.