కౌటాల, అక్టోబర్ 15: కరెంట్ కోతలతో మిర్చి పంట ఎండిపోతున్నదని సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల లోని సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ మెయిన్‌లో మంగళవారం ‘కర్షకుల కన్నెర్ర’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు సంబంధిత అధికారులు స్పందించి కౌటాల సబ్ డివిజన్ ఏడీఈ రాజేశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం గుండాయిపేట సబ్‌స్టేషన్‌లో బూస్టర్ ఏర్పాటు చేశారు. అనంతరం ఏడీఈ రాజేశ్వర్ మాట్లాడుతూ.. బూస్టర్ ఏర్పాటుతో గుండాయిపేట సబ్‌స్టేషన్ పరిధిలో నెలకొన్న లో ఓల్టేజీ సమస్య తీరుతుందని తెలిపారు. 33 కేవీ లైన్ ఈస్గాం నుంచి రావ డం వల్ల దూరం పెరిగిందని, కెపాసిటీకి మించి వినియోగం వల్ల లో ఓల్టేజీ సమస్య తలెత్తుతున్నదని పేర్కొన్నారు. 132 సబ్‌స్టేషన్ పనులు జరుగుతున్నాయని, అది పూర్తయితే ఎలాంటి విద్యుత్తు సమస్యలుండవని చెప్పారు. ఆయన వెంట ఎంఆర్టీ ఏడీఈ శ్రీనివాస్, కన్స్ట్రక్షన్ ఏడీఈ డీ శ్రీనివాస్, ఎంఆర్టీ ఏఏఈ ప్రణవి, ఆపరేషన్ ఏఏఈ రవీందర్, ఎల్ఐలు మాధవ్, రమేశ్, ప్రవీణ్, ఎల్ఎం చరణ్‌దాస్, విద్యుత్తు సిబ్బం ది ఉన్నారు. కరెంటు సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తేతెలంగాణ’కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు.