హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 9 : చరిత్రకారులు అరవింద్ ఆర్య, కట్టా శ్రీనివాస్ రచించిన ‘ఓరుగల్లు నుంచి బస్తర్ వరకు’ అనే చారిత్రక గ్రంథాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ రాజమహల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ రమణ్‌సింగ్ గురువారం ఆవిషరించారు. ఈ కార్యక్రమానికి బస్తర్ రాజ కుటుంబానికి చెందిన మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ, రాజమాత ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. స్పీకర్ రమణ్‌సింగ్ మాట్లాడుతూ.. ఈ పుస్తకం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల మధ్య ఉన్న ప్రాచీన సంబంధాలను నూతన దృకోణంలో ప్రతిపాదించిన విలువైన చారిత్రక గ్రంథమని కొనియాడారు.
చరిత్రకారులు అరవింద్ ఆర్య, కట్టా శ్రీనివాస్ కృషిని అభినందించారు. మహారాజా కమల్ చంద్రభంజ్దేవ్ మాట్లాడుతూ.. వరంగల్ నుంచి బస్తర్ వరకు ఉన్న చారిత్రక కట్టడాలు, వారసత్వ విశేషాలు ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు తెలిపారు. ఇది భవిష్యత్ తరాలకు ఒక చారిత్రక వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు.