అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి.. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో చేపట్టిన రైతు దీక్షలో బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడారు. రైతుల ఉసురుపోసుకున్న ప్రభుత్వాలేవీ పుట్టగతులు లేకుండా పోయాయని అన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాలకు రూ.25వేల నష్టపరిహారం అందించాలని.. యాసంగి పంట నుంచే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఏది గుర్తుకొస్తే అది హామీగా ఇచ్చుకుంటూ వెళ్లారని.. ఎలాగూ అధికారంలోకి రాలేమన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇష్టరీతిన హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారని బోయిన్పల్లి వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. సోనియా పుట్టినరోజు లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మాట మార్చుతున్నారని విమర్శించారు. పంటలకు చివరి తడి కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. చివరి వరకు కూడా రైతులకు అండగా బీఆర్ఎస్ నిలుస్తుందని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేస్తామన్నారు.