Boat Capsized | భద్రాచలం గోదావరి వరదలో నాటు పడవ బోల్తా పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల పరిధిలో జరిగింది. బూర్గం పహాడ్ కేంద్రంలోని మిల్ సెంటర్ నుంచి గోదావరి 12 మంది వరద బాధితులను అనధికారికంగా సంజీవరెడ్డిపాలెంలోని పునరావాస కేంద్రానికి నాటు పడవలో తరలిస్తున్నారు.
వరద బాధితులను తరలిస్తున్న ఈ నాటు పడవ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో బోల్తా పడింది. దీంతో 12 మంది నీటమునిగి కేకలు వేస్తుండగా చుట్టుపక్కల వాళ్లు చూసి తహసీల్దార్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన తహశీల్దార్..ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపారు.
వరద నీటిలో మునిగిన 12మందిలో 11 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. వారిలో ఒకరి ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వ్యక్తిని మేకా వెంకటనర్సు (40)గా గుర్తించారు. నీటిలో మునిగిన వారిలో రమేశ్‌కు ఈత రావడంతో నలుగురిని కాపాడాడు. వారిలో ఆరేండ్ల బాబు సురక్షితంగా బయటపడ్డాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకుడు గోనెల నాని మిత్రబృందం సిబ్బందికి సహకారం అందించారు.