యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలు బెడిసికొడుతున్నాయి. కమలం పార్టీ కంత్రీ పాలిటిక్స్ కలిసి రావడంలేదు. అంగట్లో పశువుల మాదిరి భారీ ఆఫర్లతో లీడర్లను కొంటూ గబ్బుగబ్బు చేస్తున్నా చుక్కెదురు తప్పడం లేదు. బీజేపీలో చేరిన వారంతా ఆ పార్టీ దుర్బుద్ధి, నీచ, నియంతృత్వ తీరును చూసి.. ఎందుకు చేరామనే డైలమాలో పడ్డారు. బీజేపీలో చేరినంక రాజగోపాల్రెడ్డి కనీసం పట్టించుకోవడంలేదని, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడని పలువురు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పాత, కొత్త నేతలకు పొసగక ఇబ్బందులు పడుతున్నారు. మూడో స్థానానికి పరిమితమయ్యే బీజేపీలో ఉండటం అవసరమా? అని సదరు నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరే నాటికి కమలం పార్టీకి కనీసం క్యాడర్ లేదు. గ్రామాల్లో కమిటీలు కూడా లేని పరిస్థితి. దీంతో రాజగోపాల్రెడ్డి ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించారు. పార్టీలో చేరితే ఊహించలేనంతగా సమకూర్చుతానని భ్రమలు కల్పించారు. పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి వచ్చేలా ప్రయత్నం చేశారు. బీజేపీలో చేరిన వారికి రూ. 50 వేలు, రూ.లక్ష చొప్పున ముట్టజెప్పారు. మిగతావి తర్వాత ఇస్తానని, ముందు కండువా కప్పుకోవాలని నమ్మబలికారు. దీంతో లీడర్లు పైసలకు ఆశపడి బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.
పెద్ద పెద్ద మాటలు చెప్పి పార్టీలో చేర్పించుకున్న రాజగోపాల్రెడ్డి ఇప్పుడు లీడర్లను సరిగా పట్టించుకోవడంలేదు. చేరికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేతలకు డబ్బులు దేవుడెరుగు.. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలుస్తున్నది.
రాజగోపాల్రెడ్డి తీరు ఇలా ఉంటే.. కొత్తగా వచ్చిన నాయకులకు పాత బీజేపీ నాయకులతో పొసగడంలేదు. పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ రోజురోజుకూ ముదిరిపోతున్నది. ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి రచ్చరచ్చ చేస్తున్నారు.
ఓడిపోయే పార్టీలో ఉండటమెందుకు?
సొంత పార్టీని వదిలేసి వచ్చిన వారికి ప్రాధాన్యం దక్కకపోగా.. అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నట్టు సమాచారం. ఇచ్చిన హామీలు పట్టించుకోకపోవడంతో వారంతా అవమానంగా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే తమను ఇలా దూరం పెడితే.. ఆ తరువాత తమ పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని మథనపడుతున్నారు. పైగా సర్వేలన్నీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కే అనుకూలంగా ఉండటం, ఏ గల్లీలో చూసినా గులాబీ ట్రెండ్ క్లియర్గా కనిపిస్తుండటంతో సదరు నాయకులంతా మనసు మార్చుకుంటున్నారు. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని, గెలిచే గులాబీ పార్టీలోకి వెళ్లడం మంచిదనే అభిప్రాయంలో వారున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరుతుండగా, మరికొందరు ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారు.