హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కని‘కట్టు’ చేయటంలో ఆరితేరినవాళ్లు బీజేపీ నేతలు అని ఈ ఫొటోలు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ‘మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిన’ చందంగా రాష్ట్రంలో బీజేపీ నేతల వ్యవహారం సాగుతున్నదనటానికి ఇంతకన్నా సాక్ష్యం ఉండదేమో! తమ ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ తమపై దాడులు చేయిస్తున్నదని బీజేపీ నేతలు నానాయాగీ చేస్తున్నారు.ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి చేసిన హంగామానే అందుకు నిదర్శనం.
ఇంతకీ ఏమైంది?
ప్రజాసంగ్రామ యాత్ర చేస్తూనే అనుమతి లేకుండా దీక్ష చేపడుతున్నారని పోలీసులు బండి సంజయ్‌ను ఈ నెల 23న పోలీసులు అదుపులోకి తీసుకొని కరీంనగర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు, కూనూరు, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాంనూరులో బీజేపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన దుమారం రేపింది. ఈ ఘటనలో తన చేయికి తీవ్ర గాయమైందని, దీనికి కారణం టీఆర్ఎస్ నాయకులేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి తన చేయికి ఉన్న కట్టును చూపి నానా హంగామా చేశారు.
కట్టు వెనుక గుట్టు!
రాకేశ్‌రెడ్డి ఎడమ చేయి బొటన వేలుకు, చూపుడు వేలుకు మధ్య బలమైన గాయమైందని తెలిపేలా ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే భారీ కట్టుతో కనిపించారు. చేయికి ఏ దెబ్బ తగలపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్లి కట్టు కట్టించుకొని నానా హంగామా చేశారు. అసలు ఆ కట్టు విప్పితే రాకేశ్‌రెడ్డి సహ బీజేపీ గుట్టురట్టు అవుతుంది. చేయికి దెబ్బ తాకిందో, లేదో కానీ పది నిమిషాల్లోనే కట్టుతో కనిపించారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకొన్నారట. ఈ కట్టు వెనుక బీజేపీ అగ్రనేతల గోబెల్స్ కనికట్టు ఉన్నదని ప్రచారం సాగుతున్నది.