హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): పేపర్ల లీకేజీపై బీజేపీ రెండు రోజుల్లోనే రెండు రకాల డ్రామాలు ఆడింది. వికారాబాద్‌లో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ కాగానే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు డిమాండ్ చేశారు. మరునాడు టెన్త్ పేపర్ లీకేజీ వెనుక సూత్రధారి బండి సంజయ్ అని పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ మాట మార్చేసింది. నిందితులను అరెస్టు చేయాలన్న ఆ నోళ్లే.. నిందితుడని తేలిన బండి సంజయ్ అరెస్ట్ అక్రమమంటూ రివర్స్ డ్రామా మొదలు పెట్టాయి. బీజేపీ నేతలంతా వరుసగా ప్రెస్మీట్లు పెట్టి.. అరెస్ట్ దుర్మార్గం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మొన్నటిదాకా పేపర్ లీక్ అయ్యిదంటూ గగ్గోలు పెట్టిన నేతలు ఇప్పుడు బండి సంజయ్‌కి పేపర్ ఎలా చేరిందన్న దానికి మాత్రం కొత్త సిద్ధాంతాలు చెప్తున్నారు.
రఘునందన్‌రావు వింత వాదన
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వింత వాదనకు దిగారు. ‘విద్యార్థులు పరీక్ష హాలులోకి వెళ్లిన రెండు గంటల తర్వాతే బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా వచ్చినవారిలో ఎవరైనా పేపర్‌ను బయటి వ్యక్తులకు ఇచ్చి ఉండవచ్చు. దాన్ని లీక్ అని ఎలా అంటాం. ఎవరో ఒకరు బండి సంజయ్‌కి పంపి ఉంటారు’ అని రఘునందన్‌రావు పేర్కొన్నారు. కానీ.. నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన విద్యార్థి పరీక్ష సమయం పూర్తిగా ముగిసే వరకు బయటకు రావడానికి వీళ్లేదు. ఈ మాత్రం తెలుసుకోకుండా రఘునందన్‌రావు ఎలా మాట్లాడుతున్నారని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ‘నిన్నటి దాకా లీకేజీ అంటూ లొల్లి పెట్టారు. ఇప్పుడేమో పిల్లలే బయటికి ఇచ్చి ఉంటారంటూ కొత్త కథలు చెప్తున్నారా?’ అంటూ మండిపడుతున్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు
బండి సంజయ్ ఫోన్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఫోన్ ఇవ్వాలని బండి సంజయ్‌ని అడిగితే.. తన వద్ద లేదని చెప్పారు. ఇప్పటికీ ఫోన్ దొరకలేదు’ అని వరంగల్ సీపీ వెల్లడించారు. కిషన్‌రెడ్డి మాత్రం ‘బండి సంజయ్‌తో నేను ఫోన్లో మాట్లాడాను. ఆయన దగ్గర ఒకటి ఉంది. రెండో ఫోన్ కూడా వాడుతున్నారేమో తెలియదు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బండి అబద్ధాలు చెప్పారని నిర్ధారణ అవుతున్నది.