హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ అమలు చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని ప్రజలు అనుకుంటున్నారని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నేలవిడిచి సాము చేశారని, అలవిగాని హామీలు ఇచ్చారని, ఆయన గ్యారంటీలను ప్రజలు నమ్మలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని త్వరలో పెను సం క్షోభంలోకి నెట్టబోతున్నదని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తేల్చిచెప్పారు. సీఎం మీద విశ్వాసం లేకపోవడం వల్లే రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని పేర్కొన్నారు. ఫేక్ వీడియోలు తయారు చేసి రేవంత్‌రెడ్డి ఫేక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ శాతం తమకు సానుకూలమని భావిస్తున్నామని, రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జూన్ 4న ఎవరూ ఊహించని ఫలితాలు రాబోతున్నాయని బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయాలనే కాంక్షతో అన్నివర్గాల ప్రజలు ఈ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని, బీజేపీ అఖండ విజయం సాధించబోతున్నదని చెప్పారు. పదేండ్ల కిందట కాంగ్రెస్ చెప్పిన దిగజారుడు మాటలనే ఇప్పుడు మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి కూడా చెప్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.