లైంగికదాడి బాధితురాలి వివరాలు వెల్లడించడంపై ఫిర్యాదు
హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ)/ అబిడ్స్/మాదన్నపేట: లైంగికదాడికి గురైన మైనర్ బాధితురాలి వివరాలు బహిరంగ పరిచినందుకు బీజీపే ఎమ్మెల్యే రఘునందన్‌పై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల సామూహిక లైంగికదాడికి గురైన బాధితురాలి ఫొటోలు, వీడియోలు రఘునందన్ రిలీజ్ చేశాడని, అది చట్టరీత్యా నేరమని పేర్కొంటూ సైఫాబాద్‌కు చెందిన న్యాయవాది కరమ్ కోమిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీ 228-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
లైంగికదాడి ఘటనలలో మైనర్లు, మహిళలకు సంబంధించిన గుర్తులు, వారి నివాసం, కుటుంబసభ్యులు, పనిచేసే చోటు, ఫొటోలు, వీడియోలు ఇలా బాధితులకు సంబంధించిన ఆనవాళ్లు బయటకు వెల్లడించరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినా కూడా జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ ఘటనలో రఘునందన్ నిబంధనలు అతిక్రమించి, మీడియా సమావేశంలో బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నగర పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్టు కోమిరెడ్డి వెల్లడించారు.
అనుచిత వ్యాఖ్యలుచేసిన రాజాసింగ్‌పై కేసు
అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ ఉమా మహేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాసింగ్ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసే విధంగా అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టాడని బాబానగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త మహ్మమద్ అలీ ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
కేసుపై పూర్తి నివేదిక పంపండి: మహిళా కమిషన్
హైదరాబాద్‌లో మైనర్‌బాలికపై జరిగిన లైంగికదాడికి సంబంధించిన కేసుపై పూర్తినివేదికను పంపాలని జాతీయ మహిళా కమిషన్ మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో తీసుకున్న చర్యలపై నివేదికను ఏడు రోజుల్లో పంపాలని సూచించారు.